పోరాట యోధురాలు చాకలి ఐలమ్మకు ఘన నివాళులు - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల, సెప్టెంబర్ 10 ( సమాజహితం ) : తెలంగాణ రైతాంగ పోరాటంలో వీరవనితగా గుర్తింపు పొందిన చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ లో గురువారం జిల్లా బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొని, వీరనారి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ రైతాంగ పోరాటంలో వీరవనితగా గుర్తింపు పొందారని, ఆమె త్యాగాలను స్మరిస్తూ ప్రభుత్వం జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ పేరిట 2022 ఏప్రిల్ లో హైదరాబాదులోని కోఠి మహిళా కళాశాలను తెలంగాణ తొలి మహిళా విశ్వవిద్యాలయంగా ప్రకటించి 2024లో వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా నామకరణం చేసిందని వివరించారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని మహిళలు స్ఫూర్తి పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజగౌడ్, జిల్లా రెవెన్యూ అధికారి కె.వై. ప్రసాద్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొని నివాళులర్పించారు.