🏠 www.samajahitham.com
Watermark
Newspaper Logo
Date of Publish : 11 September 2026, 1:14 am Posted by : SAMAJA HITHAM

నేటి నుంచి రైస్ మిల్లర్ల నిరవధిక సమ్మె

News Image
నేటి నుంచి రైస్ మిల్లర్ల నిరవధిక సమ్మె

– ఎఫ్‌సీఐ బియ్యం సేకరణ నిలిపివేతతో ఆర్థిక భారం..
– సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగింపు

జగిత్యాల, (సమాజహితం): జిల్లాలో పారా బాయిల్డ్ రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు జగిత్యాల జిల్లా పారా బాయిల్డ్ రైస్ ఇండస్ట్రీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకటించింది. ఎఫ్‌సీఐ బియ్యం సేకరణలో జాప్యం, పెండింగ్ బిల్లులు, పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, మిల్లింగ్ ప్రక్రియలోని సమస్యలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మిల్లర్లు తెలిపారు. గత రెండు నెలలుగా ఎఫ్‌సీఐ బియ్యం సేకరణ నిలిచిపోవడంతో మిల్లుల్లో బియ్యం నిల్వలు పేరుకుపోయాయని, మరోవైపు విద్యుత్, మెయింటెనెన్స్, కార్మికుల ఖర్చులు భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి పునరావృతం అవుతోందని, శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. మిల్లింగ్ సమయంలో ఎదురవుతున్న సార్టెక్స్, షార్టేజ్ సమస్యలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. ఓటీఆర్, టెస్ట్ మిల్లింగ్ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు రబీ సీజన్‌లో బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఎఫ్‌సీఐ ప్లేస్‌మెంట్ ఆలస్యం కారణంగా మిల్లుల్లో బియ్యం నిల్వలు పెరుగుతున్నాయని, నిల్వలను సకాలంలో ఎఫ్‌సీఐకి తరలించేలా ప్లేస్‌మెంట్ కల్పించాలని కోరారు. ధాన్యం సేకరణ నుంచి మిల్లింగ్, బియ్యం డెలివరీ వరకు ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకుని డ్రైజ్, హ్యాండ్లింగ్, లేబర్ ఛార్జీలు పెంచాలని, ధాన్యం మిల్లింగ్‌లో తరుగుదల, మిల్లింగ్ షార్టేజ్ నిబంధనలను పునఃపరిశీలించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న మిల్లింగ్ బిల్లులు, ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ విషయమై అసోసియేషన్ అధ్యక్షుడు రంగినేని నవీన్ రావు ఆధ్వర్యంలో ప్రతినిధులు గురువారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ లత, డీసీఎస్‌ఓ జితేందర్ రెడ్డిలను కలిసి మిల్లర్ల సమస్యలను వివరించారు. తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఎఫ్‌సీఐ బియ్యం సేకరణను వెంటనే ప్రారంభించి, పెండింగ్ బిల్లులు చెల్లించడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. మిల్లర్ల సమస్యలకు పరిష్కారం లభించే వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు.
🏠 Home