🏠 www.samajahitham.com
Watermark
Newspaper Logo
Date of Publish : 11 September 2026, 6:33 pm Posted by : SAMAJA HITHAM

వినాయక మండపాల నిర్వాహకులకు ఇబ్రహీంపట్నం పోలీసుల సూచన!

News Image

జగిత్యాల, సెప్టెంబర్ 11 (సమాజహితం): బండ లింగాపూర్ గ్రామంలో ఈరోజు ఎస్సై నవీన్ కుమార్ ఆధ్వర్యంలో సర్పంచ్ కనుగొందుల లక్ష్మీ సంజీవ్ అధ్యక్షతన వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు మండపాల నిర్వాహకుల కు పోలీసుశాఖ సూచనలు చేసారు..నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఇబ్రహీంపట్నం పోలీసులు విజ్ఞప్తి చేశారు. గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసుశాఖ పోర్టల్‌లో ఆన్‌లైన్ నమోదు చేసుకోవాలని, ప్రజా రవాణా, అంబులెన్స్‌లు, ఇతర అత్యవసర వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా మండపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సంబంధిత శాఖల అనుమతులు, విద్యుత్ శాఖ అనుమతి పొందిన తర్వాతే విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలన్నారు. ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, నీటి డ్రమ్ములు, ఇసుక అందుబాటులో ఉంచాలని, 24 గంటలు వాలంటీర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మండప నిర్వాహకుల కమిటీ, బాధ్యుల వివరాలను మండపం వద్ద ప్రదర్శించాలని సూచించారు.

మండపాల్లో, శోభాయాత్రలో డీజేలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసుల అనుమతితో చిన్న స్పీకర్లను మాత్రమే వినియోగించాలని, మండపాల వద్ద కేవలం భక్తి గీతాలు మాత్రమే ప్రసారం చేయాలని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాత్రి 10 గంటల తర్వాత స్పీకర్లను వినియోగించరాదని పేర్కొన్నారు. మండపాల వద్ద మద్యం సేవించడం, జూదం ఆడడం, అసభ్యకర కార్యక్రమాలు నిర్వహించడం, ఇతరుల మనోభావాలను కించపరిచే ప్రసంగాలు, పాటలు ప్రసారం చేయడం పూర్తిగా నిషేధమని పోలీసులు తెలిపారు. నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కనుగందుల లక్ష్మి సంజీవ్, వార్డు సభ్యులు, లింగాపూర్ వినాయక మండపాల యూత్ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
🏠 Home