ఇంట్లో బంగారం చోరీ చేసిన కుమారుడి స్నేహితుడు - అరెస్ట్
జగిత్యాల, మెట్ పల్లి, నవంబర్ 06 (సమాజహితం): మెట్ పల్లి పట్టణం రెడ్డి కాలనీకి చెందిన తలారి లావణ్య (ప్రేమలత) ఇంట్లోని బీరువా లాకర్ లో ఉన్న సుమారు 4.5 తులాల బంగారు పెద్ద గొలుసు, 2 తులాల నగరు నెక్లెస్, 0.5 తులాల కమ్మలు, బుట్టలు, 0.5 తులం పతనపు ఉంగరం, 0.5 తులం బంగారు మాటీలు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని మెట్ పల్లి ఎస్సై పి. కిరణ్ కుమార్ తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. తలారి లావణ్య తన కుమారుడు అభినవ్ యొక్క స్నేహితుడు అయిన ఇందూరి నవీన్ పై అనుమానం ఉందని, లావణ్య చెప్పడంతో నవంబర్ 06న ఉదయం అతని ఇంటి వద్ద నవీన్ ను పట్టుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. చైతన్య నగర్ కు చెందిన ఇందూరి నవీన్, తండ్రి కృష్ణమూర్తి, 26 సంవత్సరాలు, ఎలక్ట్రీషియన్ గా పని చేస్తున్నానని, వచ్చే డబ్బులు జల్సాలకు సరిపోక దొంగతనం చేయాలనుకున్నానని, తరచూ స్నేహితుడు అభినవ్ ఇంటికి వెళ్తుండగా లావణ్య బంగారు ఆభరణాలు బీరువాలో పెట్టడం, దానికి తాళం లేకపోవడం గమనించానని చెప్పాడు. అక్టోబర్ 03న మధ్యాహ్నం 12 గంటల సమయంలో అభినవ్ ఇంటికి వెళ్లగా అభినవ్ పడుకుని ఉండటం, లావణ్య భోజనం చేసి వెళ్లడంతో అదే అదునుగా బీరువాలోని బంగారు చైన్, నెక్లెస్, కమ్మల బుట్టలు, పతనపు ఉంగరం, మాటీలు దొంగిలించి జేబులో పెట్టుకుని మణప్పురం గోల్డ్ లోన్స్ మెట్ పల్లిలో ఒకేసారి తాకట్టు పెడితే అనుమానం వస్తుందని, మూడు సార్లు కొంత కొంత బంగారం తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో అప్పులు తీర్చి మిగతా డబ్బులతో హైదరాబాద్ లాంటి ప్రదేశాలకు వెళ్లి జల్సాలకు వాడుకున్నానని ఒప్పుకున్నాడు. కాగా నవీన్ ను అదుపులోకి తీసుకుని ఇద్దరు పంచుల సమక్షంలో అతడు బంగారం తాకట్టు పెట్టడానికి ఉపయోగించిన ఫోన్ ను, మణప్పురం గోల్డ్ లోన్స్ లో తాకట్టు పెట్టిన బంగారానికి సంబంధించిన రసీదులను స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం మెట్ పల్లి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగిందని మెట్ పల్లి ఎస్సై పి. కిరణ్ కుమార్ తెలిపారు.